: ఆటో డ్రైవర్ నన్ను కొడుతుంటే కోతిని చూసినట్టు చూశారు: బెంగళూరు యువతి ఆవేదన


ఆటో మీటర్ కన్నా అధికంగా ఇచ్చేందుకు నిరాకరించిన తనను ఆటో డ్రైవర్ కొడుతుంటే చుట్టూ చేరిన ప్రజలు సర్కస్ కోతిని చూసినట్టు చూశారు తప్ప, ఒక్కరైనా రక్షించడానికి రాలేదని బెంగళూరు ఉద్యోగిని ఒకరు తన ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. 100 కు ఫోన్ చేసి తన బాధను చెబితే, తాము అక్కడికి రాలేమని, పోలీసు స్టేషనుకు వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు ఉచిత సలహా ఇచ్చారని తెలిపారు. వివరాల్లోకి వెళితే, ఓలా క్యాబ్స్ లో డ్రైవర్ గా పనిచేస్తున్న రిజ్వాన్ బాషా మిగతా సమయాల్లో ఆటో నడుపుతుంటాడు. ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగిని మీటరు చెల్లించడానికి ఆటో మాట్లాడుకొని ఎక్కగా, మార్గమధ్యంలో అదనంగా రూ. 30 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దానికి అంగీకరించకపోవడంతో రోడ్డు మధ్యలో ఆటో ఆపి గొడవకు దిగాడు. తనను తిడుతూ, చెయ్యి పట్టుకొని బయటకు లాగాడని, పోలీసులకు ఫోన్ చేస్తుంటే, తనకేమీ భయం లేదంటూ పెద్దగా అరుస్తూ, తనను పలుమార్లు కొట్టాడని ఉద్యోగిని ఆరోపించింది. చుట్టూ చేరిన ప్రజల్లో ఒక్కరైనా డ్రైవర్ ను అడ్డుకునేందుకు ముందుకు రాలేదని ఆమె సామాజిక మాధ్యమాల్లో తన ఆవేదన తెలిపింది. దీనిపై స్పందించిన ఓలా ఆ డ్రైవర్ ను తమ సర్వీసుల నుంచి తొలగించామని స్పష్టం చేసింది. పోలీసులు తమ ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందిస్తూ, కేసును ట్రాఫిక్ నిర్వహణ విభాగానికి బదిలీ చేశామని, సదరు యువతి ఇంతవరకూ లిఖిత పూర్వక ఫిర్యాదు ఇవ్వలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News