: ఘర్ వాపసీకి అంబేద్కర్ మద్దతు... ఆరెస్సెస్ కొత్త వాదన!


భారత రాజ్యాంగ నిర్మాత, దళిత నేత బీఆర్ అంబేద్కర్ ఘర్ వాపసీకి మద్దతుగా నిలిచారట. అంతేకాక బలవంతంగా ఇతర మతాల్లోకి మారిన షెడ్యూల్ కులాల వారిని తిరిగి హిందూ మతంలోకి రమ్మని ఆహ్వానించారట. ఈ సరికొత్త వాదనను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తాజాగా తెరపైకి తెస్తోంది. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఆరెస్సెస్ భావజాల పత్రికలు ఆర్గనైజర్, పాంచజన్యలు ‘కలెక్టర్స్ ఎడిషన్’ పేరిట ప్రత్యేక సంచికలను విడుదల చేయనున్నాయట. ఇప్పటిదాకా ఆ పత్రికలు ఆరెస్సెస్ వ్యవస్థాపకుడు కేబీ హెగ్డేవార్ పై మాత్రమే ప్రత్యేక సంచికను విడుదల చేశాయి. మరో సందర్భంలో రామ జన్మభూమి అంశంపై కూడా ఆ పత్రికలు ప్రత్యేక సంచికను ప్రచురించాయి. ఆ తర్వాత తాజాగా అంబేద్కర్ పై ప్రత్యేక సంకలనాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. పాకిస్థాన్ తో పాటు నిజాం నవాబు అధీనంలోని హైదరాబాదులోనూ నిరుపేద దళితుల మతాన్ని ముస్లింలు బలవంతంగా మార్చేశారట. దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన అంబేద్కర్, ఆయా ప్రాంతాల పాలకులకు హెచ్చరికలు చేయడమే కాక మతం మారిన దళితులను తిరిగి హిందూ మతంలోకి మారాలని సూచించారట. అంబేద్కర్ కు సంబంధించిన మరెన్నో ఆసక్తికర అంశాలను ఆ పత్రికలు వెలికితీయనున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News