: దేవాలయాల బంగారంపై మోదీ సర్కారు కన్ను!
తిరుమల శ్రీవెంకటేశ్వర దేవాలయం, త్రివేండ్రం అనంత పద్మనాభ స్వామి దేవాలయం, ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయం, షిర్డీ సాయి బాబా గుడి... ఇలా చెప్పుకుంటూ పొతే ఇండియాలో అపారమైన బంగారు నిల్వలను కలిగి ఉన్న దేవాలయాల సంఖ్య అధికంగానే ఉంది. ఇప్పుడీ దేవాలయాలలో ఉపయోగంలో లేకుండా ఇనప్పెట్టెలు, లాకర్లలో ఉన్న బంగారాన్ని వాడుకలోకి తేవాలని మోదీ సర్కారు భావిస్తోంది. ద్రవ్యలోటు గణనీయంగా పెరుగుతున్న తరుణంలో ఈ బంగారం దేశ ఆర్థిక వ్యవస్థను ఆదుకోగలదని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తోడు విదేశాల నుంచి అక్రమంగా భారత్ లోకి తరలిస్తున్న బంగారాన్ని అడ్డుకోవచ్చని కూడా మోదీ సర్కారు అంచనా వేస్తోంది. దేవాలయాల వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేలా చూసి దానికి వడ్డీలు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. అలా సేకరించిన బంగారాన్ని కరిగించి ఆభరణాల వర్తకులకు అమ్మడం ద్వారా బంగారం అక్రమ రవాణాను అరికట్టవచ్చని కేంద్రం యోచిస్తోంది. అయితే, ఎంతో భక్తితో దేవుళ్ళకు భక్తులు సమర్పించిన ఆభరణాలను కరిగించాలన్న ఆలోచనకు మిశ్రమ స్పందన వస్తోంది. సుమారు 158 కిలోల బంగారు ఆభరణాలు కలిగి ఉన్న ముంబై సిద్ది వినాయక దేవాలయం ట్రస్ట్ చైర్మన్ నరేంద్ర మురారీ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ఇదే సమయంలో దేవాలయానికి భారీగా బంగారాన్ని కానుకగా ఇచ్చిన ఓ వ్యాపారి మండిపడ్డారు. తాను దేవుడికి కానుకలు ఇచ్చానుగానీ దేవాలయం ట్రస్టీకి కాదని అన్నాడు. కాగా, ఇండియా ప్రతి ఏటా 800 నుంచి 1000 టన్నుల వరకూ బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. దేవాలయాలు తమ స్కీంలో పాల్గొని బంగారాన్ని బ్యాంకుల్లో పెడితే బంగారం దిగుమతి కనీసం 25 శాతం తగ్గుతుందని ప్రభుత్వ అధికారులు లెక్కలు వేస్తున్నారు. భారతీయుల వద్ద సుమారు 17 వేల టన్నుల బంగారం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఆ బంగారాన్ని కూడా బ్యాంకుల్లో పెట్టి వడ్డీ పొందే ఒక ప్రత్యేక పథకాన్ని మోదీ త్వరలో ప్రకటించనున్నట్టు సమాచారం.