: పుట్టిన 7వ రోజునే విమానమెక్కిన చిన్నారి పార్వతి... ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సైన్యం
హుతీ తిరుగుబాటుదారులు, సౌదీ సైన్యం మధ్య యుద్ధం జరుగుతున్న యెమన్ నుంచి భారతీయుల తరలింపు పూర్తయింది. ఈ ఉదయం కేరళ లోని కొచ్చి విమానాశ్రయానికి ఎయిర్ ఫోర్సుకు చెందిన ప్రత్యేక విమానం 382 మందిని స్వదేశానికి చేర్చింది. అందులో ప్రత్యేకత ఏమిటని అనుకుంటున్నారా? ఉందండీ... వీరిలో 7 రోజుల క్రితం పుట్టిన చిన్నారిపాప పార్వతి కూడా ఉంది. యెమన్ రాజధాని సనాలో పనిచేస్తున్న సాష్ కుమార్ సతీమణి రాజి వారం రోజుల క్రితం పండంటి పాపకు జన్మనిచ్చారు. ఆ పాపను కామెర్లు, శ్వాస సమస్యలు వెన్నాడాయి. బాంబుల మోతల మధ్య దంపతులను, పాపను రక్షించి విమానాశ్రయానికి తీసుకొచ్చారు. వాస్తవానికి అంత చిన్నవారిని విమాన ప్రయాణానికి అనుమతించరు. కానీ, తప్పనిసరి పరిస్థితి నెలకొని ఉండటంతో, సైన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఒక ఇంక్యుబేటర్ సీ-17 గ్లోబ్ మాస్టర్ విమానంలో పెట్టించి ఆ పాపను ఇండియాకు చేర్చారు. విమానంలో చాలినంత స్థలం లేకపోవడంతో పాప తండ్రి యెమన్ నుంచి ఓడలో ఇండియాకు వస్తున్నాడట.