: అమ్మాయి పక్కన కూర్చుంటే విమానంలో ప్రయాణించబోనన్న పెద్దమనిషి
అది న్యూయార్క్ నుంచి లండన్ వెళ్తున్న విమానం. ఫ్రాన్సెస్కా హోగి (40) అనే మహిళ తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. కాసేపటికి వచ్చిన ఒక వ్యక్తి ఆమె పక్కన కూర్చోవడానికి నిరాకరించారు. తాను సంప్రదాయాలు పాటించే జ్యూయిష్ వ్యక్తినని, భార్య తప్ప మరో మహిళ పక్కన కూర్చోలేనని విమాన సిబ్బందితో అన్నాడట. దీంతో గత్యంతరం లేని పరిస్థితిలో హోగి తన సీట్ మార్చుకునేందుకు అంగీకరించి మరో చోట కూర్చున్నారు. అమెరికా నుంచి ఇజ్రాయిల్ తదితర దేశాలకు ప్రయాణిస్తున్న విమానాల్లో ఈ తరహా ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో జ్యూయిష్ సంప్రదాయాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కాగా, మహిళల స్పర్శ తగలకుండా ఉండేందుకు పురుషులు తల నుంచి పాదాల వరకూ కప్పి ఉంచే దుస్తులు ధరించాలని జ్యూయిష్ మ్యాగజైన్ ఒకటి ప్రత్యేక కథనం ప్రచురించడం గమనార్హం.