: ఒక్క రోజులో 10 వేల ఖాతాలను తొలగించిన ట్విట్టర్
సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్ ఒక్క రోజులో 10 వేలకుపైగా ఖాతాలను తొలగించింది. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఐఎస్ఐఎస్ మద్దతుదారులు, వారు చర్చించుకుంటున్న ఖాతాలపై నిఘా ఉంచి వాటిని తొలగించినట్టు ట్విట్టర్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. ట్విట్టర్ లో ప్రతి ఒక్క ఖాతాలో వస్తున్న పోస్ట్ లను పరిశీలించడం అసాధ్యమని, అయితే కొన్ని సెర్చ్ వర్డ్స్ ఆధారంగా పోస్టింగ్ చూస్తూ వాటిని సస్పెండ్ లో పెడుతున్నట్టు తెలిపారు. కాగా, ఇస్లామిక్ స్టేట్ కు చెందిన సానుభూతి పరులు 90 వేలకు పైగా అకౌంట్స్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్ మాధ్యమంగానే ఐఎస్ఐఎస్ రిక్రూట్ మెంట్స్ జరుగుతున్నాయని, దీన్ని నిలువరించడంలో విఫలం అవుతున్నారని గత కొంత కాలంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతోనే ఖాతాల స్తంభన నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు.