: ఆలె నరేంద్ర వల్లే తెలంగాణ...కేసీఆర్ ను ఆరెస్సెస్ వద్దకు తీసుకెళ్లింది కూడా ఆయనే!: దత్తన్న
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడానికి మేము కారణమంటే, కాదు మేమంటూ... టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు పరస్పరం వాదించుకుంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే అసలు తెలంగాణ అంశంపై కేంద్రం వద్ద గళమెత్తడంతో పాటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆరెస్సెస్ కార్యాలయానికి తీసుకెళ్లింది కూడా దివంగత నేత ఆలె నరేంద్రనే అని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. నరేంద్ర ప్రథమ వర్ధంతిని పురస్కరించుని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దత్తన్న ఈ మేరకు వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆరెస్సెస్ కార్యాలయానికి వెళ్లడం వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని కూడా దత్తన్న సూత్రీకరించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఓ రాజకీయ పార్టీనే పెట్టిన ఆలె నరేంద్ర అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వద్ద తెలంగాణ అంశాన్ని మూడు సార్లు ప్రస్తావించారని తెలిపారు.