: రోజుకు 19 గంటలు శ్రమించాం!: ‘సత్యం’కేసుపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!
వేలాది మంది మదుపరులను నట్టేట ముంచడంతో పాటు భారత వ్యాపార ప్రతిష్ఠను విశ్వ విపణిలో మంటగలిపిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు రామలింగరాజు సహా పదిమందికి ఏడేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది. అయితే నిందితులను కోర్టు దోషులుగా ప్రకటించేందుకు అవసరమైన సాక్ష్యాల సేకరణ, ఆధారాల సమీకరణ తదితరాల కోసం దర్యాప్తు సంస్థ సీబీఐ అసాధారణ కసరత్తే చేయాల్సి వచ్చింది. నాడు కేసు నమోదైన సమయంలో సీబీఐ ఏపీ శాఖకు జేడీగా, నిజాయతీ ఐపీఎస్ అధికారిగా పేరుగాంచిన లక్ష్మీనారాయణ ఉన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కేసును దర్యాప్తు చేసిన ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. సత్యం కేసును ఆయనే దర్యాప్తు చేశారు. నిన్న కోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ఆయన స్పందించారు. కేసులో నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు రోజుకు కనీసం 19 గంటల పాటు కష్టపడి పనిచేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ‘‘ఇది చాలా పెద్ద కేసు. దర్యాప్తులో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. వేలల్లో కార్యకలాపాలు, ఎన్నో సాంకేతిక అంశాలు. వీటిని అర్థం చేసుకోవడానికి, మిస్టరీని ఛేదించడానికి ఎంతో కష్టపడ్డాం. అప్పట్లో మా బృందం రోజుకు 18 నుంచి 19 గంటల పాటు పనిచేయాల్సి వచ్చింది. మాకంటే ముందు దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు కూడా అద్భుతంగా పనిచేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన 43 రోజులకే తొలి చార్జిషీట్ ను దాఖలు చేయగలిగాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసులోని కీలక రహస్యాలను ఛేదించడానికి పలు దేశాల్లో పర్యటించాల్సి వచ్చిందని కూడా లక్ష్మీనారాయణ తెలిపారు.