: మరింత చౌకగా రోమింగ్ ఛార్జీలు... కాల్, ఎస్ఎంఎస్ టారిఫ్ లను తగ్గించిన ట్రాయ్
జాతీయ రోమింగ్ కాల్స్, టెక్స్ట్ మేసేజెస్ ఛార్జీలు మరింత చౌక కానున్నాయి. వాటిపై సీలింగ్ టారిఫ్ లను ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) తగ్గించింది. నూతన ఛార్జీలు మే 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అంతేగాక ప్రత్యేక రోమింగ్ టారిఫ్ ప్లాన్ ను ఆఫర్ చేయబోతున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో బయటకు చేసే లోకల్ కాల్స్ కు నిమిషానికి రూపాయి నుంచి 80 పైసలు, ఎస్ టీడీ కాల్స్ కు నిమిషానికి రూ.1.50 నుంచి రూ.1.15కు ట్రాయ్ తగ్గించింది. ఇక ఇన్ కమింగ్ కాల్స్ రోమింగ్ విషయంలో నిమిషానికి 75 పైసల నుంచి 45 పైసలకు, లోకల్ ఎస్ఎంఎస్ లకు రూపాయి నుంచి 25 పైసలు, ఎస్ టీడీ ఎస్ఎంఎస్ కు రూ.1.50 పైసల నుంచి 38 పైసలకు ఛార్జీలు తగ్గాయి. "వినియోగదారులందరూ తగ్గించిన సీలింగ్ ఛార్జీల ద్వారా ప్రయోజనం పొందుతారు" అని ట్రాయ్ ఓ ప్రకటనలో తెలిపింది. కొత్త ఛార్జీలతో కాల్ ఛార్జీలు 20 శాతం, మెసేజింగ్ రేట్లు 75 శాతం పడిపోయాయి.