: పెన్సిల్ దొంగిలించాడని చితకబాదిన ప్రిన్సిపాల్... రక్తం కక్కుకొని విద్యార్థి మృతి
ఉత్తరప్రదేశ్, రైలమావ్ సమీపంలోని ఒక పాఠశాలలో ఘోరం జరిగింది. పెన్సిల్, ఎరేజర్ దొంగిలించాడన్న ఆరోపణలతో ఏడేళ్ల బాలుడిని ప్రిన్సిపాల్ నిర్దయగా చావగొట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బారాబంకీలోని ద్వారకా ప్రసాద్ స్కూల్ లో ఇద్దరు విద్యార్థులు కొత్తగా చేరారు. స్కూల్ లో ఒక విద్యార్థి తన పెన్సిల్, ఎరేజర్ కనిపించడం లేదని ఫిర్యాదు ఇవ్వడంతో, రంగంలోకి దిగిన ప్రిన్సిపాల్ విద్యార్థుల బ్యాగ్స్ తనిఖీ చేయించాడు. కొత్తగా చేరిన ఇద్దరిలో ఒక బాలుడి దగ్గర అవి దొరికాయి. దీంతో ప్రిన్సిపాల్ పట్టలేని కోపంతో ఆ చిన్నారిని ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. ఏడుస్తూ ఇంటికి వెళ్ళిన ఆ బాలుడు తొలుత కడుపునొప్పి అని చెప్పి, ఆపై రక్తం కక్కుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ బాలుడి ప్రాణాలు దక్కలేదు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ప్రిన్సిపాల్ లలితకుమార్ వర్మను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బారాబంకీలో విషాదఛాయలు అలముకున్నాయి.