: ఎన్నో సామాజికసేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా...శిక్ష తగ్గించండి: జడ్జితో రామలింగరాజు
మోసానికి పాల్పడి లక్షలాది మంది ఇన్వెస్టర్లను నట్టేట్లో ముంచడమే కాక, విశ్వ విపణిలో భారత కీర్తి ప్రతిష్ఠలను మంటగలిపిన సత్యం కంప్యూటర్స్ అధినేత రామలింగరాజు, శిక్షను తప్పించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఈ కేసులో రామలింగరాజు సహా పదిమందిని దోషులుగా నిర్ధారిస్తూ కొద్దిసేపటి క్రితం నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రామలింగరాజు, తన శిక్షను తగ్గించాలని న్యాయమూర్తిని వేడుకున్నారు. ఇందుకు తాను చేపట్టిన సామాజిక కార్యక్రమాలను ఆయన ఏకరవు పెట్టారు. బిజినెస్ స్కూలు, 108 వైద్య సేవలు తదితర ప్రజాసేవలతో పాటు పెద్దఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టిన తనకు శిక్షలో మినహాయింపునివ్వాలని జడ్జికి విజ్ఞప్తి చేశారు. వయోవృద్ధులైన తన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని చెప్పిన రాజు, శిక్షను తగ్గించాలని న్యాయమూర్తిని అభ్యర్థించారు.