: సత్యం కుంభకోణం వెలుగు చూసిందిలా!
సత్యం రామలింగరాజు... భారత ఐటీ రంగంలో ఒక విప్లవంలా దూసుకొచ్చారు. హైదరాబాద్ కేంద్రంగా ఐటీ కంపెనీని స్థాపించి, దాన్ని అత్యున్నత స్థాయికి చేర్చి అంతే వేగంగా పాతాళానికి చేర్చిన వ్యక్తి. లేని లాభాలను ఉన్నట్టుగా చూపుతూ, ఉద్యోగుల సంఖ్యను ఎవరికీ అనుమానం రాని విధంగా పెంచి వాటాదారులను మోసం చేసిన వ్యక్తి. చివరికి తన తప్పు తాను ఒప్పుకొని షేర్ హోల్డర్లకు లేఖ రాసే దాకా విషయం బయటకు రాలేదంటే, కంపెనీలో కుంభకోణాన్ని ఎంత సమర్థవంతంగా నడిపారో ఊహించుకోవచ్చు... ఈ కుంభకోణం వెలుగులోకి ఎలా వచ్చిందంటే... 2009 జనవరి 7న తన తప్పు ఒప్పుకుంటూ రామలింగరాజు షేర్‌హోల్డర్లకు లేఖ రాశారు. మొత్తం రూ. 7,100 కోట్ల మేరకు ఆర్థిక అవకతవకలు జరిగాయని, తాను పులి మీద స్వారీ చేస్తున్నానని ఆయన తెలిపారు. లేని లాభాలను ఉన్నట్లుగా చూపి సంస్థ విలువను పెంచానని పేర్కొన్నారు. దీంతో హైదరాబాదుకు చెందిన వాటాదారు లీలామంగత్ ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కేసును సీబీఐకి అప్పగించగా, రామలింగరాజు, రామరాజు, వడ్లమాని శ్రీనివాస్‌లను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. కేసు విచారణకు సీబీఐ డీఐజీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో మల్టీ డిసిప్లెయినరీ ఇన్వెస్టిగేషన్ టీం (ఎండీఐటీ) ఏర్పాటు కాగా, కేసును పూర్తిగా దర్యాప్తు చేసిన సీబీఐ 2009 ఏప్రిల్ 7న ప్రధాన చార్జిషీట్‌ను దాఖలు చేసింది. సుమారు రెండేళ్లపాటు జైల్లో ఉన్న రామలింగరాజు అనారోగ్య కారణాలతో బెయిలుపై బయటకు వచ్చారు. కోర్టు మొత్తం 226 మంది సాక్ష్యులను విచారించి, 75 డాక్యుమెంట్లను పరిశీలించి ఆర్నెల్ల క్రితమే విచారణను పూర్తి చేసి తీర్పును రిజర్వు చేసింది. రామలింగరాజుకు ఎంత శిక్ష పడుతుంది? అన్న విషయం రేపు వెల్లడి కానుంది. కాగా, రాజుకు 5 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్ష, భారీ జరిమానా విధించవచ్చని సమాచారం.