: నా లోగో నాకు ఇచ్చేయండి: ఆమ్ ఆద్మీ పార్టీకి కార్యకర్త ఝలక్
ఆమ్ ఆద్మీ పార్టీపై సామాన్యుల వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోంది. ఆ పార్టీకి గతంలో సహకరించినవారు ఇప్పుడు దూరమవుతున్నారు. తాను ఆప్ కు బహుమతిగా ఇచ్చిన నీలి రంగు వాగన్ ఆర్ కారును వెనక్కు ఇచ్చేయాలని నిన్న ఒక కార్యకర్త డిమాండ్ చేయగా, ఆ పార్టీ వాడుతున్న లోగోను తానే డిజైన్ చేశానని, దాన్ని ఇకపై ఎక్కడా వాడరాదని సునీల్ లాల్ అనే పార్టీ వాలంటీర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు ఆయన లేఖ రాశారు. తాను డిజైన్ చేసిన లోగోపై ఎవరికీ హక్కులు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ స్టేషనరీ, వెబ్ సైట్, హ్యాండ్ బిల్ల్స్, జండాలు, పోస్టర్లు తదితరాలపై ఈ గుర్తును వాడుకోవద్దని సూచించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేసిన తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ప్రజల అంచనాలు అందుకోవడంలో ఆప్ విఫలం అయినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సునీల్ వివరించారు.