: భారత విమానాలు మరింత సేఫ్... భద్రత ర్యాంకింగ్ ను పెంచిన అమెరికా
భద్రతా ప్రమాణాల్లో మెరుగైన పనితీరును కనబరుస్తూ, ప్రమాదాలకు దూరంగా ఉంటున్న భారత విమానయాన ర్యాంకింగ్ ను సవరిస్తున్నట్టు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. ప్రస్తుతమున్న కేటగిరీ 2 నుంచి కేటగిరీ 1కు భారత వైమానిక భద్రత ర్యాంకింగ్ ను పెంచుతున్నట్టు తెలిపింది. భద్రతా ప్రమాణాల్లో కేటగిరీ 1కి భారత్ చేరుకోవడం ఆనందాన్ని కలిగిస్తోందని విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. దేశంలో 32 విమానాశ్రయాల్లో ఎటువంటి కార్యకలాపాలు జరగడంలేదని ఆయన తెలిపారు. కొత్త విమానాశ్రయాలను అభివృద్ధి చేయాల్సిన అవసరముందన్న ఆయన, కొత్తగూడెంలో విమానాశ్రయంపై నివేదిక వచ్చాక పరిశీలిస్తామని వివరించారు. కాగా, ఈ నిర్ణయంతో భారత విమానయాన సంస్థలైన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్ లు అమెరికాలో విస్తరించేందుకు మార్గం సుగమమైంది.