: తమిళనాడులో జీఎంఆర్ ఆస్తులపై దాడులు
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టింది. స్మగ్లర్లు అంటూ, అమాయక కూలీలను మట్టుబెట్టారని తమిళనాడు రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేయగా, ఇదే అదనుగా భావించిన అల్లరి మూకలు ఆంధ్రాకు చెందిన కంపెనీల ఆస్తులపై దాడులకు తెగబడుతున్నాయి. ఈ మధ్యాహ్నం తిరుచ్చిలో ఆందోళనకారులు జీఎంఆర్ గ్రూప్ నిర్వహణలోని ఒక టోల్ ప్లాజాను ధ్వంసం చేశారు. సమీపంలోని సంస్థ కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నీచర్ నాశనం చేశారు. తమిళనాడులోని ఆంధ్రా బ్యాంకు శాఖలపై దాడులు చేస్తామని బెదరింపు కాల్స్ వస్తుండటంతో, చెన్నైలోని అన్ని కార్యాలయాల వద్ద భద్రత పెంచారు. ఆంధ్రా క్లబ్ ను తాత్కాలికంగా మూసివేశారు. కాగా, ఇప్పటివరకూ ఆందోళనకారులు 11 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని సమాచారం.