: 'స్వచ్ఛ భారత్'పై వెనకడుగు ... రూ. 635 కోట్ల నిధుల కోత
ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు 'స్వచ్ఛ భారత్'పై కేంద్రం వెనకడుగు వేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికిగాను 'స్వచ్ఛ భారత్'కు కేటాయించిన నిధుల్లో రూ. 635 కోట్ల కోతను విధించాలని కేంద్రం నిర్ణయించింది. పలు ఇతర సంక్షేమ పథకాలకూ నిధులను తగ్గించింది. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పోషకాహారాన్ని అందించే ఐసీడీఎస్ పథకానికి గత సంవత్సరం రూ. 17,858 కోట్లు కేటాయించగా, ఈ ఏడు అది రూ. 9,858 కోట్లకు తగ్గించింది. గ్రామీణ మంచినీటి పథకానికి కేటాయించిన నిధుల్లో రూ. 8,390 కోట్ల మేరకు కోత పెట్టింది. 2014-15లో రూ. 9,193.75 కోట్లు కేటాయించిన సర్వ శిక్షా అభియాన్ కు ఈ ఏడు కేవలం రూ. 2 వేల కోట్లతో సరిపెట్టింది. వీటిల్లో చాలా స్కీములు ప్రస్తుతం అమలులో ఉన్నాయని, కేంద్రం అకస్మాత్తుగా నిధులు తగ్గిస్తే ప్రజా సంక్షేమం పరిస్థితి ఏంటని కర్ణాటక రాష్ట్ర ఆహార సరఫరా శాఖ మంత్రి దినేష్ రావు ప్రశ్నించారు.