: సల్మాన్ కు మరో సమస్య... ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశం
ఇప్పటికే హిట్ అండ్ రన్, కృష్ణ జింకల కేసులతో సతమతమవుతున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తాజాగా మరో సమస్యలో చిక్కుకున్నాడు. నేరపూరిత బెదిరింపులు, దోపిడీ కింద అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముంబయి అంధేరీలోని ఓ కోర్టు ఎయిర్ పోర్టు పోలీసులను ఆదేశించింది.'భ్రష్టాచార్ నిర్మూలన్ సమితి' సభ్యుడైన రవీంద్ర మూరత్ ద్వివేది ఫిర్యాదు మేరకు న్యాయస్థానం ఈ ఆదేశాలిచ్చింది. గతేడాది నవంబర్ 4న ముంబయి ఎయిర్ పోర్టు వద్ద సల్మాన్, అతని బాడీగార్డ్ తనను బెదిరించారని ఫిర్యాదులో తెలిపాడు. తరువాత ఢిల్లీకి ముగ్గురూ విమానంలో వెళుతున్న సమయంలో మళ్లీ వాళ్లిద్దరూ తనతో గొడవకు దిగి తనవద్ద ఉన్న ముఖ్యమైన పత్రాలను లాక్కున్నారని వివరించాడు. అవి దివంగత బీజేపీనేత గోపీనాథ్ ముండే మరణానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలని చెప్పాడని ఎయిర్ పోర్టు పోలీసులు వెల్లడించారు. అంతేగాక సల్మాన్, అతని బాడీగార్డ్ తనను దుర్భాషలాడి, దాడి చేశారని కూడా ఆరోపించినట్టు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే తాను ఫిర్యాదు చేసేందుకు ఎయిర్ పోర్టు పోలీసుల వద్దకు వెళ్లగా కేసు నమోదు చేసేందుకు పోలీసు స్టేషన్ సిబ్బంది నిరాకరించారని ఫిర్యాదులో చెప్పుకొచ్చాడు.