: మాటలతో సరిపెట్టారు... ప్రాణాలు కాపాడలేదు: సర్కారుపై సిద్ధయ్య కుటుంబం ఆరోపణ
నల్గొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో ఉగ్రవాదుల బుల్లెట్ల కారణంగా మృత్యువాత పడ్డ ఎస్సై సిద్ధయ్య కుటుంబం ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉగ్రవాదుల బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో చేరిన సిద్ధయ్య ప్రాణాలను కాపాడే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సర్కారు నిర్లక్ష్యం కారణంగానే సిద్ధయ్య చనిపోయాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘అందరూ వచ్చి చూశారు. సిద్ధయ్యను బతికిస్తామని... ఇన్ని కోట్లు, అన్ని కోట్లు ఖర్చు చేస్తామని మాటలు చెప్పారే తప్పించి ఏమీ చేయలేదు. వైద్యులు కూడా ఏమీ చెప్పకుండా అన్యాయం చేశారు. మమ్మల్ని మా తమ్ముడి దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆస్పత్రి వాళ్లు దొంగలు’’ అని సిద్ధయ్య సోదరులు మాబాషా, దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. నిపుణులను పిలిపిస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక్కరిని కూడా పిలిపించలేదని వారు వాపోయారు. సిద్ధయ్యనే కాక అదే ఆస్పత్రిలో ఆయన భార్య ప్రసవించిన శిశువు ఆరోగ్యాన్ని కూడా కామినేని వైద్యులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెయిన్ బో ఆస్పత్రికి బాలుడిని తీసుకెళ్లగా, శిశువు ఆరోగ్యంపై ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ అక్కడి వైద్యులు ప్రశ్నించడమే ఇందుకు నిదర్శనమని వారు వాపోయారు.