: అదే స్థలం... నాలుగేళ్ల క్రితం పోలీసులపై దాడి చేసిన చోటే వికార్ గ్యాంగ్ హతం!


పోలీసులపై ఉగ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ దాడి నిన్న కొత్తేమీ కాదు. గతంలోనూ తమను కోర్టుకు తీసుకెళుతున్న పోలీసు సిబ్బందిపై వికారుద్దీన్ గ్యాంగ్ దాడికి దిగింది. ఎక్కడనుకుంటున్నారు? నిన్న పోలీసు కాల్పుల్లో వారు హతమైన చోటే. నాలుగేళ్ల క్రితం 2011, నవంబర్ 12న హైదరాబాదులోని ఎల్బీ నగర్ కోర్టులో జరిగిన విచారణకు వికారుద్దీన్ గ్యాంగ్ హాజరైంది. విచారణ అనంతరం తిరిగి ఆ గ్యాంగ్ ను ఎస్కార్ట్ పోలీసులు మూడు వాహనాల్లో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. వరంగల్ చేరుకోకముందే, సరిగ్గా నిన్న దాడి జరిగిన ఆలేరు పరిసర ప్రాంతంలోనే ఆ గ్యాంగ్ పోలీసులపై దాడికి దిగింది. అయితే గ్యాంగ్ సభ్యులను ఎలాగోలా నిలువరించిన పోలీసులు జనగామ చేరుకున్న తర్వాత అక్కడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా నిన్న సరిగ్గా నాడు దాడికి పాల్పడ్డ ప్రదేశానికి చేరుకోగానే పోలీసులపై మరోమారు దాడికి దిగిన వికారుద్దీన్ బృందం తప్పించుకునేందుకు విఫల యత్నం చేసింది. అయితే క్షణాల్లో అప్రమత్తమైన పోలీసులు జరిపిన కాల్పుల్లో వికారుద్దీన్ సహా అతడి అనుచరులు నలుగురు కూడా హతమయ్యారు.

  • Loading...

More Telugu News