: పక్కా బూటకపు ఎన్ కౌంటర్...బాబు మూల్యం చెల్లించుకోక తప్పదు: చెవిరెడ్డి
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పందించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, ఇది పక్కా బూటకపు ఎన్ కౌంటర్ అని అన్నారు. ఎక్కడినుంచో పట్టుకొచ్చిన 20 మందిని కాల్చిచంపారని ఆయన ఆరోపించారు. నిజమైన ఎన్ కౌంటర్ అయితే, కాల్పుల్లో ఒకరు చనిపోయిన తరువాత మిగిలిన వారు పారిపోతారని ఆయన అన్నారు. కాల్పులు జరుగుతున్నా తిరగబడేందుకు వారేమీ తీవ్రవాదులు కాదని ఆయన చెప్పారు. సంఘటనా స్థలంలో శవాలు గుట్టలుగా పడిఉండడం ఇది బూటకపు ఎన్ కౌంటర్ అనే అనుమానం రేపుతోందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.