: ప్రైమ్ టైమ్ ప్రదర్శనల సమయంలో మరాఠీ చిత్రాలనే వేయాలి... మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
ముంబయిలోని అన్ని మల్టీఫ్లెక్స్ సినిమా హాల్స్ లో ప్రైమ్ టైమ్ లో ప్రతిరోజు సాయంత్రం మరాఠీ చిత్రాలనే ప్రదర్శించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. ఈ మేరకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఒక మల్టీఫ్లెక్స్ లో కనీసం ఒక స్క్రీన్ ను మరాఠీ సినిమా కోసం రిజర్వు చేయాలని ఆ రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి వినోద్ తవ్డే తెలిపారు. అంతేగాక అన్ని మల్టీఫ్లెక్సుల్లో ప్రధాన చిత్రం మొదలవక ముందు లెజండరీ దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కేపై చిన్న చిత్రాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలని చెప్పారు. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే పలువురి నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రాంతీయ సినిమాను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి ప్రశంసనీయమని, కానీ ప్రైవేటు సినిమా థియేటర్లపై రుద్దడం సరికాదని విమర్శకులంటున్నారు.