: కేవలం గొడ్డు మాంసాన్నే నిషేధించాం: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వివరణ
మహారాష్ట్రలో కేవలం గొడ్డు మాంసంపైనే నిషేధం విధించామని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు వివరణ ఇచ్చారు. "ఇతర జంతువుల వధపై నిషేధం లేదు. అడ్వకేట్ జనరల్ తప్పుగా వ్యాఖ్యానించారు. ఇతర జంతువులపై కూడా నిషేధాన్ని కొనసాగించే ఆలోచన లేదు" అని ఫడ్నవీస్ ప్రకటించారు. కేవలం అవు, ఎద్దు మాంసంపైనే నిషేధం ఎందుకు విధించారని, మేకలు వంటి ఇతర జంతువుల మాటేమిటంటూ నిషేధంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ప్రశ్నించింది. ఇందుకు అడ్వకేట్ జనరల్ సునీల్ మనోహర్ సమాధానమిస్తూ, ఇతర జంతువుల మాంసాన్నీ నిషేధించే అవకాశాన్ని ప్రభుత్వం మున్ముందు పరిశీలిస్తుందని చెప్పారు. ఈ కారణంగానే ఫడ్నవీస్ తాజాగా పైవిధంగా సమాధానమిచ్చారు.