: సినిమా షూటింగ్ హాట్ స్పాట్ గా బస్ భవన్!
బస్ భవన్... హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద సువిశాల ప్రాంతంలో నిర్మితమైన ఈ భవనం ఏపీఎస్ఆర్టీసీకి కేంద్ర కార్యాలయం. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీకి కార్యాలయంగా మారనుంది. అయితే ఆర్టీసీ విభజన పూర్తి కాని నేపథ్యంలో ఈ భవనం ఇంకా ఏపీఎస్ఆర్టీసీ కార్యాలయంగానే కొనసాగుతోంది. నిన్నటిదాకా ఆర్టీసీ ఉద్యోగులకే పరిమితమైన ఈ భవనంలో ఇప్పుడిప్పుడే సినిమా సందడి నెలకొంటోంది. సువిశాల విస్తీర్ణంలో, విశాలమైన ఫ్లోర్లతో అత్యాధునిక హంగులతో నిర్మితమైన ఈ భవనంలో సినిమా షూటింగ్ లకు టాలీవుడ్ ప్రముఖులు ఎగబడుతున్నారు. ఇటీవల యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఓ చిత్రం షూటింగ్ ఇక్కడ జరిగింది. కార్యాయల పనివేళల్లో షూటింగ్ జరిగితే, విమర్శలు వెల్లువెత్తుతాయన్న భయంతో అధికారులు, రాత్రి పూట షూటింగ్ లకైతే ఓకే చెబుతున్నారు. దీంతో బాలయ్య చిత్రం మలిదశ షెడ్యూల్ నిన్నటి నుంచి బస్ భవన్ లో ప్రారంభమైంది. అసలే అప్పుల్లో కూరుకుపోయిన సంస్థకు ఇలా సినిమా షూటింగ్ ల ద్వారానైనా కాస్త ఆదాయం చేకూర్చిపెడదామన్న అధికారుల నిర్ణయంతో బస్ భవన్ లో షూటింగ్ లు ప్రారంభమయ్యాయని వినికిడి. రోజుకు రూ.70 వేల అద్దెకు లభిస్తున్న బస్ భవన్ లో షూటింగ్ కోసం చిత్ర ప్రముఖులు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. అంటే, రానున్న కాలంలో బస్ భవన్ షూటింగ్ లకు హాట్ స్పాట్ గా మారడం ఖాయమేనన్నమాట.