: తెలంగాణకు ఆర్.కృష్ణయ్య సీఎం అవడం ఖాయం... ఏపీ మంత్రి ప్రత్తిపాటి జోస్యం!
తెలంగాణ సీఎం పీఠంపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తెలంగాణ సీఎం పీఠంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కూర్చోవడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. బీసీ సంక్షేమ సంఘం ఏపీ శాఖకు సంబంధించిన మహిళా విభాగం ప్రమాణ స్వీకారోత్సవం నిన్న గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రత్తిపాటి, బీసీలకు అండగా ఉంటామని ప్రకటించారు. ‘‘అదృష్టం బాగుంటే మొన్నటి ఎన్నికల్లోనే ఆర్.కృష్ణయ్య తెలంగాణ సీఎం అయ్యేవారు. కొన్ని అనుకోని కారణాల వల్ల కాలేకపోయారు. అయితే భవిష్యత్తులో కృష్ణయ్య తెలంగాణ సీఎం కావడం ఖాయం’’ అని ప్రత్తిపాటి జోస్యం చెప్పారు.