: వారంలో 3 ఎన్ కౌంటర్లు... తుపాకీ గుళ్లకు 30 మంది బలి: వణికిపోతున్న తెలుగు ప్రజలు


తెలుగు రాష్ట్రాలు తుపాకీ గుళ్ల మోతలతో వణికిపోతున్నాయి. కేవలం వారం వ్యవధిలో జరిగిన మూడు ఎన్ కౌంటర్లలో ఏకంగా 30 మంది తుపాకీ గుళ్లకు బలి కావడం తెలుగు ప్రజలను షాక్ కు గురి చేసింది. వరుసగా జరిగిన ఈ ఘటనలతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ ప్రజలు భయాందోళనల్లో వున్నారు. పోలీసులపై దుండగులు దాడులకు దిగడమే ఈ మూడు ఎన్ కౌంటర్లకు కారణం కావడం కూడా గమనార్హం. ఈ నెల 1న నల్గొండ జిల్లా సూర్యాపేటలో మొదలైన తుపాకీ గుళ్ల మోత, నేటి ఉదయం రెండు రాష్ట్రాల్లో పతాక స్థాయికి చేరుకుంది. సూర్యాపేట బస్టాండ్ లో ఇద్దరు పోలీసులను పొట్టనబెట్టుకున్న ఇద్దరు సిమీ ఉగ్రవాదులను అదే జిల్లాలోని మోత్కూరు మండలం జానకీపురం ఎన్ కౌంటర్ లో పోలీసులు మట్టుబెట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు వీరమరణం పొందాడు. ప్రస్తుతం ఈ కేసులో ఇరు రాష్ట్రాల పోలీసులతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, కేంద్ర నిఘా వర్గాలు ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా గడచిన రాత్రి చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఏపీ పోలీసులు, అటవీ శాఖాధికారులు జరిపిన కాల్పుల్లో 20 మంది ఎర్రచందనం కూలీలు హతమయ్యారు. తమను నిలువరించేందుకు వచ్చిన పోలీసులపై రాళ్లతో దాడి చేసిన స్మగ్లర్లపై భద్రతా బలగాలు కాల్పులు జరపక తప్పలేదు. కూలీల దాడిలో 10 మందికి పైగా పోలీసులు కూడా గాయపడ్డట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడి కాకముందే వరంగల్ జిల్లాలోని ఆలేరు-జనగాం మధ్యలో కొద్దిసేపటి క్రితం జైలుకు వస్తున్న క్రమంలో కరుడు గట్టిన ఉగ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ ఎస్కార్ట్ సిబ్బందిపై దాడి చేసింది. పోలీసులపై పైచేయి సాధించి, తప్పించుకుని పారిపోతున్న సదరు గ్యాంగ్ పై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News