: నేనిచ్చిన కారు, డబ్బు తిరిగి ఇచ్చేయ్!: కేజ్రివాల్ ను డిమాండ్ చేసిన ఆప్ లండన్ అభిమాని
ఢిల్లీలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రివాల్ తిరిగిన బ్లూ కలర్ వాగన్-ఆర్ కారు గుర్తుందా? ఆ కారును బ్రిటన్ లో పనిచేస్తున్న ఆప్ వీరాభిమాని కుందన్ శర్మ బహుమతిగా ఇచ్చారు. ఆమ్ ఆద్మీ నేతల మధ్య ఇటీవలి గొడవలు ఆయనకు మనస్తాపాన్ని కలిగించాయి. దీంతో తాను బహుమతిగా ఇచ్చిన కారును, తనతో కలిసి తన భార్య డొనేట్ చేసిన నగదును వెనక్కు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఆప్ కు ఆది నుంచి మద్దతు ఇస్తూ వచ్చిన కుందన్ శర్మ, ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. ఆ కారు తన భార్య పేరిట రిజిస్టర్ అయిందని, నిర్భయ ఘటనపై పార్టీ స్పందన చూసిన తరువాత కారును డొనేట్ చేశానని తెలిపారు. జనవరి 1, 2013న కేజ్రివాల్ తనతో స్వయంగా మాట్లాడారని, 3వ తేదీన కారును ఇచ్చానని, తనను అభినందిస్తూ, పార్టీ లెటర్ హెడ్ పై ఒక లేఖ కూడా రాశారని తెలిపారు. కేజ్రివాల్ ఇన్నోవా వాహనంలో పర్యటనలు మొదలుపెట్టేదాకా ఈ వాగన్-ఆర్ కారులోనే తిరిగారు. ఈ కారును, తాను ఇచ్చిన డబ్బును తిరిగివ్వాలని శర్మ చేసిన డిమాండ్ పై ఆప్ ఇంకా స్పందించలేదు.