: రూ. 600 ఇవ్వండి... మోదీ టీ అమ్మిన ప్రాంతంలో తిరగండి... గుజరాత్ టూరిజం ప్యాకేజ్
భారత ప్రదాని నరేంద్ర మోదీ పుట్టిన ఊరు, తిరిగిన ప్రదేశాలు, ఆయన చిన్నతనంలో టీ అమ్మిన రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో తిరగాలని ఉందా? ఐతే మీరు గుజరాత్ టూరిజం అందిస్తున్న ప్రత్యేక ప్యాకేజ్ గురించి తెలుసుకోవాల్సిందే. టూరిజం కార్పోరేషన్ అఫ్ గుజరాత్ లిమిటెడ్ నిర్వహిస్తున్న ఈ టూర్ కు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. గాంధీనగర్, అహ్మదాబాద్ నగరాల నుంచి మొదలయ్యే పర్యటన మహేసనా జిల్లాలోని మోదీ పూర్వీకుల గ్రామం వాద్ నగర్ వెళ్తుంది. అక్కడ మోదీ చదువుకున్న స్కూల్, ఆయన నాటకాలు వేసిన హై స్కూల్, ఆ తరువాత ఆయన ఇల్లు, పని చేస్తూ టీ అమ్మిన రైల్వే స్టేషన్, ఆయన డ్రమ్స్ వాయించిన హటకేశ్వర్ దేవాలయం, మోదీ చిన్నప్పుడు మొసలిని పట్టుకున్న శర్మిష్ఠ సరస్సు తదితర ప్రాంతాలను చుట్టి వస్తుంది. జనవరిలో జరిగిన వైబ్రెంట్ గుజరాత్ సందర్భంగా 'ఏ రైజ్ ఫ్రం మోదీస్ విలేజ్' పేరిట ప్యాకేజ్ మొదలు పెట్టగా, ఇప్పుడిది హాట్ టూరిజం ప్యాకేజ్ గా మారింది. నిత్యమూ వందలాది మంది ఈ ప్రాంతాలను చుట్టి వస్తున్నారు. అన్నట్టు మోదీ గురించి మరింత తెలుసుకోవాలని భావించే వారికోసం ఆయన చిన్ననాటి మిత్రులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదీ సంగతి!