: 70ల్లోనే శ్రీదేవితో ప్రేమలో పడిన నిర్మాత!
అతనో యువకుడు... సినిమాలపై అనురక్తి.. చిత్ర నిర్మాణంపై ఆసక్తి మెండుగా ఉన్న ఆ వ్యక్తి కొంతకాలానికి నిర్మాతగా తన కలల రంగంలోకి అడుగుపెట్టాడు. అందాలతార శ్రీదేవి అప్పుడప్పుడే మంచి నటిగా పేరు తెచ్చుకుంటోంది. 1970 దశకం చివర్లో ఓ తమిళ సినిమాలో శ్రీదేవిని చూసిన ఆ యువకుడు ఆమె రూపాన్ని మర్చిపోలేకపోయాడు. పదేపదే గుర్తుకురావడంతో ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఓ రోజు ధైర్యం చేసి ఆమె ఇంటికి కూడా వెళ్ళాడు. అయితే శ్రీదేవి షూటింగ్ నిమిత్తం సింగపూర్ వెళ్ళిందన్న సమాధానం వినిపించడంతో నిరాశే మిగిలింది.
అయితే, కొంతకాలానికి తన స్వప్న సుందరితో సినిమా నిర్మించాలన్న ఆలోచన ఆ యువకుడి మదిలో మెదిలింది. అంతే, ఇంకేం ఆలోచించలేదీ ముంబయి వాలా. వెంటనే శ్రీదేవిని సంప్రదించి తన సినిమాలో నటించాల్సిందిగా కోరాడు. ఆమె రూ. 10 లక్షలు డిమాండ్ చేస్తే, రూ. 11 లక్షలు ఇచ్చాడు. లవ్ ముఖ్యం కదా... మనీ మేటర్స్ అన్నీ దాని తర్వాతే అని ఈ యువకుడూ నమ్మాడు.
ఇంతకీ ఆ సినిమా పేరు చెప్పనేలేదు కదూ.. 'మిస్టర్ ఇండియా'. ఆ సినిమా షూటింగ్ తొలి రోజు నుంచే మనోడి ప్రేమ ప్రయాణం జెట్ స్పీడుతో దూసుకెళ్ళిందట. ఎంతవరకంటే వీళ్ళిద్దరూ 1996లో పెళ్ళి చేసుకునేంతవరకూ! ఇంతకీ మన వీర ప్రేమికుడి పేరు బోనీ కపూర్.. బ్రదరాఫ్ అనిల్ కపూర్. ఇదండీ బోనీ కపూర్-శ్రీదేవిల కహానీ. ఇప్పటికీ శ్రీదేవి అంటే పడిచచ్చేంత ప్రేమేనని బోనీ చెబుతున్నాడు!