: జమ్మలమడుగులో టీడీపీ నేతపై దుండగుల దాడి... గన్ మెన్ కాల్పులతో పరారీ
కడప జిల్లా జమ్మలమడుగు మునిసిపాలిటీ వైస్ చైర్మన్, టీడీపీ నేత ముల్లా జానీపై నిన్న రాత్రి దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారును అటకాయించి కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో జానీ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. జమ్మలమడుగు మండలంలోని ఎస్. ఉప్పలపాడు గ్రామానికి వెళ్లి వస్తున్న క్రమంలో జానీపై నలుగురు వ్యక్తులు దాడికి దిగారు. వెంటనే జానీ అంగరక్షకుడు రెండు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపాడు. దీంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న జమ్మలమడుగు డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని, ఘటన జరిగిన తీరుపై వివరాలు సేకరించి, దుండగుల కోసం గాలింపు చేపట్టారు.