: అమ్మాయిలకు సెల్ఫోన్లు ఇస్తే జీవితాలు నాశనం... మరో బీజేపీ నేత ఉవాచ
ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక నిత్యమూ ఎక్కడో ఒకచోట బీజేపీ నేతల వివాదాస్పద వ్యాఖ్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా, మహిళలు, బాలికలపై వీరు చేస్తున్న వ్యాఖ్యలు మోదీ తదితర పార్టీ పెద్దలకు తలనొప్పి తెచ్చి పెడుతున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే సుందర్ లాల్ అమ్మాయిలకు సెల్పోన్లు ఇవ్వొద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఝుంఝునూలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సెల్ఫోన్ వల్ల అమ్మాయల జీవితాలు పాడైపోతున్నాయని, వారు అనవసరమైన విషయాలు నేర్చుకుంటున్నారని, దీనివల్ల జీవితాల మీద చెడు ప్రభావం పడుతుందని చెప్పుకొచ్చారు. ఆయన మాటలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, సహించేది లేదని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ప్రజాప్రతినిధులు పెడచెవిన పెట్టడం గమనార్హం.