: 2 గంటల్లో 200 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
నాలుగు రోజుల వరుస సెలవుల అనంతరం స్టాక్ మార్కెట్ సంతృప్తికర లాభాలను నమోదు చేసింది. సెషన్ ప్రారంభం నుంచీ ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు మధ్యాహ్నం 1:30 గంటల తరువాత ఒక్కసారిగా ముందుకు దూకాయి. అన్ని సెక్టార్లలోని ఈక్విటీలకూ కొనుగోలు మద్దతు వచ్చింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, ఫండ్ సంస్థలూ, రిటైల్ పెట్టుబడిదారులు ఉత్సాహంగా వాటాల కొనుగోళ్లు చేశారు. యూరప్ మార్కెట్ల లాభాలు సెంటిమెంట్ ను పెంచాయని నిపుణులు వ్యాఖ్యానించారు. సోమవారం నాటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సెన్సెక్స్ సూచీ 244.32 పాయింట్లు పెరిగి 0.86 శాతం లాభంతో 28504.46 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ సూచీ 73.65 పాయింట్లు పెరిగి 0.86 శాతం లాభంతో 8,659.90 పాయింట్ల వద్ద కొనసాగాయి. రియాల్టీ ఇండెక్స్ అత్యధికంగా 6.43 శాతం లాభపడింది. మెటల్, బ్యాంకెక్స్ మినహా మిగతా అన్ని సెక్టార్లూ లాభాలను నమోదు చేశాయి. మొత్తం 2,839 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా, 1,808 కంపెనీలు లాభాలను, 922 కంపెనీలు నష్టాలనూ నమోదు చేయగా, మరో 109 కంపెనీల షేర్ విలువలో మార్పు నమోదు కాలేదు.