: అన్నయ్యపై కక్షతో చెల్లిని వేధిస్తున్న ఇంజినీరింగ్ కాలేజీ!
వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు తెలపాలంటూ గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యానికి సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అవినాష్ రెడ్డి అనే వ్యక్తి దరఖాస్తు చేయగా, అదే కళాశాలలో చదువుతున్న అతని చెల్లెలికి హాల్ టిక్కెట్ ఇవ్వకుండా యాజమాన్యం వేధించింది. స్వతంత్ర అనే విద్యార్థిని కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. వచ్చే నెలలో ఆమె ఫైనల్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉండగా, అందుకు అవసరమైన అనుమతిని కాలేజ్ యాజమాన్యం నిరాకరించింది. కాలేజీ యాజమాన్యం అక్రమంగా ఫీజులు వసూలు చేస్తోందంటూ తాను మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన నేపధ్యంలో తన సోదరిపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని అవినాష్ ఆరోపించాడు. ఈ విషయంపై అతను జేఎన్టీయూను ఆశ్రయించగా, స్వతంత్రకు హాల్ టిక్కెట్ ఇవ్వాలని రిజిస్ట్రార్ ఆదేశించినట్టు తెలుస్తోంది.