: ఆ బ్యాగు ఏమైంది? ... లభిస్తే ‘సూర్యాపేట షూటర్స్’ ప్లాన్ చిక్కుముడి వీడినట్లే!
నల్గొండ జిల్లా సూర్యాపేటలోని హైటెక్ బస్టాండులో ఈ నెల 1న అర్ధరాత్రి పోలీసులపై కాల్పులకు దిగిన సందర్భంగా నాడు దోపిడీ దొంగలుగా భావించిన సిమీ ఉగ్రవాదుల భుజానికి ఓ బ్యాగు కనిపించింది. అయితే అదే జిల్లా మోత్కుపల్లి మండలం జానకీపురం వద్ద పోలీసుల కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల వద్ద మాత్రం సదరు బ్యాగు లేదు. అసలు ఆ బ్యాగు ఏమైంది? రెండు రోజుల వ్యవధిలోనే ఆ బ్యాగు ఎక్కడికి చేరింది? రెండు రోజుల పాటు సూర్యాపేట సమీపంలోనే తలదాచుకున్న షూటర్స్, ఆ బ్యాగును ఎక్కడ దాచారు? ఎవరికి ఇచ్చారు?... ఇత్యాది ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఉగ్రవాదులు హతమైనా, వారి సహచరులు మరో ముగ్గురు రాష్ట్రంలోనే ఉన్నారని, వారికోసం గాలిస్తున్నామని చెబుతున్న పోలీసులు... నిన్న అర్వపల్లి గుట్టలు, అక్కడికి సమీపంలోని మసీదు, పరిసర పొలాల్లో రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర నిఘా వర్గాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం సభ్యులు నిన్న అణువణువూ వెదికారు. ఆ వెదుకులాట అంతా, హైటెక్ బస్టాండ్ లో ఉగ్రవాదుల భుజానికి వేలాడుతూ కనిపించన బ్యాగు కోసమేనట. ఆ బ్యాగు దొరికితే కీలక సమాచారం దొరికినట్లేనని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాక ఉగ్రవాదుల భవిష్యత్ వ్యూహాలకు సంబంధించిన కీలక సమాచారం కూడా దొరికినట్లేనన్న వాదన వినిపిస్తోంది. సదరు బ్యాగులో ఉగ్రవాదుల సమగ్ర సమాచారం ఉన్న ల్యాప్ టాప్ కూడా ఉండి ఉంటుందని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు.