: అందులో తల దూర్చొద్దు...నా పట్టుదల కూడా వదిలేస్తా: ఇమ్రాన్ ఖాన్
యెమెన్, సౌదీ అరేబియా మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో తలదూర్చవద్దని పాకిస్థాన్ ప్రతిపక్షనేత, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ కు సూచించారు. యెమెన్, సౌదీ అరేబియా వ్యవహారంపై తమ వైఖరిపై చర్చించేందుకు షరీఫ్ టర్కీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆఫ్ఘనిస్థాన్ పై అమెరికా యుద్ధంలో జోక్యం చేసుకున్నందుకు పాక్ తీవ్రంగా నష్టపోయిందని, మరోసారి అలాంటి నష్టం జరగకూడదంటే మౌనంగా ఉంటే మంచిదని ఇమ్రాన్ ప్రధానికి సలహా ఇచ్చారు. పాకిస్థాన్ కు నష్టం జరగకుండా ఉండేందుకు తమ పార్టీ నిర్ణయించిన పార్లమెంట్ బాయ్ కాట్ ను కూడా పక్కనపెట్టి, యెమెన్ యుద్ధంలో పాక్ తీరుపై రేపు జరిగే ఉభయసభల సంయుక్త సమావేశంలో పాల్గొంటానని ఆయన చెప్పారు. కాగా, గత ఎనిమిది నెలలుగా పార్లమెంటు సమావేశాలకు ఇమ్రాన్ నేతృత్వంలోని తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ ఎంపీలు హాజరుకావడం లేదు.