: 1700 చట్టాల్లో సవరణలు...700 చట్టాలు తొలగిస్తాం: మోదీ
ప్రస్తుత సమాజానికి పనికిరాని 700 చట్టాలను తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో జరుగుతున్న మూడురోజుల జాతీయ న్యాయసదస్సులో ఆయన మాట్లాడుతూ, 1700 చట్టాల్లో మార్పులు అవసరమని అన్నారు. న్యాయవ్యవస్థలో మార్పులు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేసి, సమస్యల పరిష్కారానికి బలమైన యంత్రాంగం రూపొందించాలని ఆయన సూచించారు. తప్పులు చేస్తూ చట్టంలోని ఏదో ఒక పరిష్కారంతో తప్పించుకునే అవకాశం ఉందని, ఇలా ఒకదాని తరువాత, మరొకటి ఎన్ని తప్పులు చేసుకుంటా వెళ్తామో సమీక్షించుకోవాలని ఆయన సూచించారు. ట్రైబ్యునళ్లు న్యాయపరిష్కారం కోసం ఏర్పాటు చేశారా? లేక సమస్యను సాగదీయడం కోసం ఏర్పాటు చేశారా? అనే అనుమానం వస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 100 ట్రైబ్యునళ్లు ఉన్నాయని, వాటి నిర్వహణకు అయ్యే ఖర్చుతో ఎన్నో కోర్టు భవనాలు నిర్మించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తాను అధికారంలో ఉండే ఈ ఐదేళ్లలో రోజుకో పనికిరాని చట్టాన్ని రద్దుచేయాలనుకుంటున్నానని ఆయన చెప్పారు.