: తెలుగు రాష్ట్రాల్లో మరో ముగ్గురు ముష్కరులున్నారట... కూంబింగ్ లో ఎన్ఐఏ
సూర్యాపేట షూటర్స్ ఎన్ కౌంటర్ తో భీతిగొలిపే పలు అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఎన్ కౌంటర్ లో హతమైన అస్లాం, జకీర్ లు నల్గొండ జిల్లా సూర్యాపేటలోనే కాక హైదరాబాదుతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటించారని పోలీసులకు విశ్వసనీయ ఆధారాలు లభ్యమయ్యాయి. నెల్లూరు జిల్లాలోని తడలో ఐదుగురు సిమి ఉగ్రవాదులున్నారని తమిళనాడు పోలీసులు ఏపీ పోలీసులను అప్రమత్తం చేశారు. అంతేకాక సదరు ఐదుగురి ఫొటోలను కూడా తమిళ పోలీసులు ఏపీ పోలీసులకు అందజేశారు. ఈ ఫొటోల్లో నిన్న హతమైన అస్లాం, జకీర్ లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన ముగ్గురు ముష్కరులు కూడా తెలుగు రాష్ట్రాల పరిధిలోనే ఉన్నారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాక తెలుగు రాష్ట్రాల్లో చొరబడ్డ సదరు ఉగ్రవాదుల వద్ద మారణాయుధాలు కూడా ఉన్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో ఇద్దరు ముష్కరులు హతమైనా, పోలీసుల సోదాలు మాత్రం ఆగలేదు. తాజాగా నల్గొండ పోలీసులకు తోడుగా ఎన్ఐఏ అధికారులు కూడా సోదాలు ప్రారంభించారు. పోలీసుల ముమ్మర సోదాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.