: ఆమె బతికింది 17 ఏళ్లే...కానీ 146 ఏళ్లు బతికినట్టు లెక్క


ఆమె బతికింది 17 ఏళ్లే కానీ, 146 ఏళ్లు బతికినట్టు లెక్క అని వైద్యులు చెబుతున్నారు. అమితాబ్ బచ్చన్ 'పా' సినిమాలో పోషించిన పాత్ర లాంటి వ్యాధితో బాధపడుతూ, ఎంతోమందికి జీవితంపై స్పూర్తి రగిలించిన 17 ఏళ్ల హేలీ ఒకైన్స్ కు నూరేళ్లు నిండాయి. మూడేళ్ల క్రితం డాక్యుమెంటరీల ద్వారా, ఇటీవలే ఆత్మకథ ద్వారా ప్రపంచానికి పరిచితురాలైన హేలీ మరణించిన విషయాన్ని ఆమె తల్లి కెర్రీ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. తన బిడ్డ రాత్రి 9:30 గంటలకు తన చేతుల్లోనే తుది శ్వాస విడిచిన విషయాన్ని ఆమె వెల్లడించారు. దీంతో 'చురుగ్గా, అందంగా ఉండే ఓ ఇంగ్లీషు గులాబీ పువ్వా గుడ్ బై. మీ అమ్మ పంపిన సందేశం చూసి దిగ్భ్రాంతి చెందాం' అంటూ 'ది ప్రొగేరియా రీసెర్చ్ ఫౌండేషన్' నివాళులర్పించింది. అరుదైన 'ప్రొగేరియా' వ్యాధితో బాధపడుతున్న హేలీ జీవితం చిన్నదని తెలుసుకున్న క్షణం నుంచి జీవితంపై అవగాహన పెంచుకుని, ఓ జీవితంలో చేయాల్సినవన్నీ చేసింది. డాల్ఫిన్స్ తో ఆడుకుంది. ఆసీస్ సింగర్ కైలీ మినోగ్, కెనడా సింగర్ జస్టిన్ బీబర్ తో ఆడిపాడింది. ప్రిన్స్ చార్లెస్ ను కలుసుకుంది. ఈ వ్యాధి బారిన పడినవారిలో ముసలితనం ముంచుకొస్తుంది. పదవఏడు చేరుకునే సరికి, 80 ఏళ్లు పైబడిన వారిలా మారిపోతారు. సాధారణ వ్యక్తులకంటే ఈ వ్యాధితో బాధపడేవారిలో 8 రెట్లు ఎక్కవ వయసు పూర్తైపోతుంది. ఈ వ్యాధి సోకితే సాధారణంగా 13 ఏళ్లకే తనువు చాలిస్తారు. కానీ హేలీ మాత్రం 17 ఏళ్లు జీవించింది. వైద్యుల లెక్క ప్రకారం ఆమె 146 ఏళ్లు జీవించినట్టు. చివరిగా హేలీ మాట్లాడుతూ, అన్ని రకాలుగా తాను ఎంతో అదృష్టవంతురాలినని పేర్కొంది. 'ప్రపంచం మొత్తం తిరిగాను, ఎంతో మందిని కలిశాను. ఓ జీవితంలో చేసినదానికంటే ఎక్కువే చేశానని, ఈ జీవితం చాల'ని చెప్పింది.

  • Loading...

More Telugu News