: 'ఇండియన్ ఐడల్' జడ్జిగా సోనాక్షి సిన్హా
బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాక్షి సిన్హా బుల్లితెరపై కొత్త అవతారంలో కనిపించబోతోంది. ఇప్పటివరకూ సినిమాల్లో తన నటనతో అలరించిన అమ్మడు, ఇక నుంచి ఓ పాటల కార్యక్రమానికి జడ్జిగా తన అభిప్రాయాలను వెల్లడించనుంది. ప్రముఖ హిందీ రియాలిటీ షో 'ఇండియన్ ఐడల్ జూనియర్'కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్ లో వెల్లడిస్తూ... తనను తాను షాట్ గన్ జూనియర్ గా పేర్కొంది. "షాట్ గన్ జూనియర్ ఇండియన్ ఐడల్ లో భాగం కాబోతోంది. ఈ విషయాన్ని ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. చాలా ఎక్సైటెడ్ గా ఉంది" అని సోను ప్రకటించింది. దాంతో అభిమానులంతా ఈ విషయాన్ని సామాజిక అనుసంధాన వేదికలో తెగ ప్రచారం చేస్తున్నారు.