: అద్వానీ, మోదీ... ఎదురుపడ్డా పలకరించుకోలేదట!
బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీల మధ్య దూరం నానాటికీ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీని ప్రధాని అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన నాటి నుంచి వీరిద్దరి మధ్య సంబంధాలు చెడాయి. అయితే ఎప్పుడూ ఈ విభేదాలు బయటకు కనబడలేదు. బెంగళూరులో జరుగుతున్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సదస్సు మాత్రం వారిద్దరి మధ్య విభేదాలున్నాయన్న స్పష్టమైన ఆధారాలు ఇచ్చేసింది. సదస్సుకు హాజరైన సందర్భంగా ఎదురుపడ్డ ఈ ఇద్దరు నేతలు మాట్లాడుకోవడం కాదు కదా, పరస్పర అభివాదం కూడా చేసుకోలేదు. అంతేకాక వేదికపై కూర్చున్న సందర్భంగా వారిరువురూ ఎడమొగం పెడమొగంగానే గడిపారు. భరతమాతకు అంజలి ఘటించేందుకు అద్వానీ వచ్చిన సందర్భంగా అక్కడే ఉన్న మోదీ, కనీసం ఆయన వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక వేదికపై కూర్చున్నంతసేపు అద్వానీ ఏదో ముళ్లపై కూర్చున్నట్టుగానే కనిపించారు.