: రాహుల్ పై వ్యాఖ్యలకుగానూ మోదీకి కాంగ్రెస్ కౌంటర్
దేశ రాజకీయాలకు దూరంగా ఉంటూ, అకస్మాత్తుగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అదృశ్యమవడంపై జాతీయ కార్యవర్గ సమావేశాల తొలి రోజునే బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. ఇందుకు కౌంటర్ గా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ సహా పలువురు పార్టీ నేతలను మోదీ విస్మరించారంటూ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సురెజ్ వాలా మాట్లాడుతూ, బెంగళూరులో జరుగుతున్న కార్యవర్గ సమావేశాల్లో మోదీ, అమిత్ షా వాస్తవ విషయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అంతేకాకుండా పార్టీలోని సీనియర్ నేతల పట్ల పాటించాల్సిన సంప్రదాయాలను మరుస్తున్నారని ఆరోపించారు. 2002లో ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని తీసివేయాలని నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయీ అనుకున్నప్పటికీ అద్వానీయే కాపాడారన్నారు. ఇప్పుడు ఢిల్లీలో అధికారం దక్కించుకుని, ప్రధాని అయిన మోదీ నాడు తనను రక్షించిన అద్వానీ సహా పార్టీ సీనియర్ నేతలందరినీ రాజకీయ చరిత్ర అనే చెత్తబుట్టలో పడవేశారని వ్యాఖ్యానించారు .