: నేడు సంపూర్ణ చంద్ర గ్రహణం... తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన ఆలయాల మూసివేత
నేడు సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాలన్నీ మూతపడనున్నాయి. నేటి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 7.17 గంటల వరకు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. గ్రహణం సమయంలో మూతపడనున్న ప్రధాన ఆలయాల్లో ఆ తర్వాత సంప్రోక్షణ అనంతరం తిరిగి భక్తులకు దర్శనం లభించనుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల దాకా మూతపడనుంది. తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉదయం 11 గంటల నుంచి ఆదివారం ఉదయం దాకా మూతపడనుంది. రాహుకేతు క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయం మాత్రం నేడు తెరిచే ఉంటుంది. గ్రహణం ఏర్పడుతున్నా నేడు ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోని మూతపడనున్న ఇతర ప్రధాన ఆలయాల వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం: మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7.45 దాకా కనకదుర్గ (విజయవాడ): ఉదయం 10 నుంచి ఆదివారం ఉదయం 4 దాకా సింహాచలం: ఉదయం 9 నుంచి ఆదివారం ఉదయం 6.30 దాకా ధర్మపురి: ఉదయం 8 నుంచి రాత్రి 8 దాకా అన్నవరం: ఉదయం 10 నుంచి ఆదివారం ఉదయం 5.30 దాకా కాణిపాకం: ఉదయం 8 నుంచి రాత్రి 8.30 దాకా కొండగట్టు: ఉదయం 8.30 నుంచి ఆదివారం వేకువజాము 3 దాకా శ్రీశైలం: ఉదయం 6.30 నుంచి రాత్రి 8 దాకా వేములవాడ: ఉదయం 4 నుంచి రాత్రి 8.05 దాకా కాళేశ్వరం: ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 4 దాకా భద్రకాళి (వరంగల్): ఉదయం 11 నుంచి రాత్రి 7 దాకా