: సెక్సీగా కనిపించడం మహిళా సాధికారత కాదు: కంగనా రనౌత్
మహిళా సాధికారతపై దీపికా పదుకునే లేవదీసిన చర్చ సామాజిక మాధ్యమాలను కుదిపేస్తోంది. మహిళా సాధికారత అంటే వివాహేతర సంబంధాలు కొనసాగించడం కాదని దీపిక వీడియోకు ఘాటుగా సోనాక్షి సిన్హా జవాబివ్వగా, తాజాగా కంగనా రనౌత్ కూడా స్పందించింది. మనసులో మాటను ఉన్నదున్నట్టు చెప్పే కంగనా కటువుగానే స్పందించింది. సెక్సీగా కనిపించడం మహిళా సాధికారత కాదని చెప్పింది. మహిళా సాధికారత అంటే క్రమపద్ధతిలో సాగే ప్రక్రియ అని చెప్పింది. నచ్చినట్టు బట్టలేసుకుంటేనో, నచ్చినట్టు ఉంటేనో సాధికారత వచ్చేసినట్టు కాదని, సమాజంలో గూడుకట్టుకుపోయిన అసమానత్వపు భావనలను మార్చడం సాధికారత అని కంగనా చెప్పింది. మహిళలు అభివృద్ధి చెందడమంటే పురుషులను అణచివేసినట్టు కాదని కంగా స్పష్టం చేసింది. అంతఃపరివర్తనతో అది సాధ్యమవుతుంది తప్ప సెక్సీగా కనిపిస్తే కాదని తెలిపింది. కాగా, దీపికా పదుకునే మై ఛాయిస్ వీడియోలో "నచ్చినట్టు బట్టలు వేసుకుంటా, పెళ్లికి ముందే సెక్స్ లో పాల్గొంటా, నా ఇష్టం" అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.