: ఐఎస్ఐఎస్ నరహంతకులను వణికిస్తున్న వైరస్
ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు లీష్మనియాసిస్ అనే ప్రాణాంతక వ్యాధికి భయపడుతున్నారు. ఇసుక ప్రాంతాల్లో తిరిగే చిన్న రెక్కల పురుగు వల్ల వ్యాపించే ఈ వ్యాధి సిరియాలో విస్తరిస్తోందని సమాచారం. సిరియాలో లక్ష మందికి ఈ వ్యాధి ఉన్నట్టు తెలుస్తోంది. యాంటీ వైరస్ చికిత్స ద్వారా దీనిని అరికట్టే అవకాశం ఉన్నప్పటికీ, అక్కడ సరైన వైద్య సదుపాయలు లేకపోవడం, ఉన్న వైద్యం తీసుకునేందుకు తీవ్రవాదులు నిరాకరించడంతో ఇది వ్యాప్తి చెందుతోంది. అక్కడున్న వైద్యులకు దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో పోషకాహారం తీసుకోని ప్రజలు దీనికి బలవుతున్నారు. సిరియాలోని ఎన్జీవోల వైద్యులు దీనిని అరికట్టేందుకు ప్రయత్నించినప్పటికీ అంతర్యుద్ధం కారణంగా వారు అక్కడ్నుంచి తరలిపోయారు. దీంతో, ఇది ప్రబలుతోంది. ప్రపంచంలోని 98 దేశాల్లో ఈ వ్యాధి ఉన్నప్పటికీ, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, అల్జీరియా, బ్రెజిల్, కొలంబియా దేశాల్లో ఈ వ్యాధి సోకడం సాధారణ విషయమని, సాధారణంగా మందులతో తగ్గిపోతుందని నివేదికలు చెబుతున్నాయి.