: అవినీతిపై పోరాటానికి 'స్టింగ్ యాప్' తెస్తున్న ఢిల్లీ గవర్నమెంట్
అవినీతిని బహిర్గతం చేసేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఓ మొబైల్ అప్లికేషన్ ను రూపొందిస్తోంది. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు దాంతో స్టింగ్ ఆపరేషన్స్ చేయవచ్చు. సదరు వ్యక్తికి తెలియకుండా చాలా రహస్యంగా అతని వీడియో, ఆడియో రికార్డింగ్స్ చేయవచ్చట. "వీలైనంత త్వరలో ఈ అప్లికేషన్ ను ఉపయోగించి వినియోగదారుడు రికార్డింగులు చేయవచ్చు. ఈ సమయంలో ఫోన్ స్విచ్చాఫ్ అయినట్లు డార్క్ గా కనిపిస్తుంది" అని ఈ యాప్ ప్రాజెక్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సురక్షితమైన ప్రభుత్వ సర్వర్ ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా స్మార్ట్ ఫోన్లకు ఈ యాప్ లింక్ చేస్తున్నట్టు చెప్పారు. రికార్డు చేసిన వీడియో లేదా ఆడియో దానంతటదే ప్రభుత్వ సర్వర్ లో స్టోర్ అవుతుందని వివరించారు. ఒకవేళ మొబైల్ పాడైన డేటా ఏమాత్రం పోదన్నారు. ఓ నెలలో ఈ యాప్ ను తీసుకొచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అంతేగాక అవినీతి వ్యతిక హెల్ప్ లైన్ నెంబర్ '1031'ను కూడా ఈ నెల 5న తిరిగి ప్రారంభించనుందట. లంచం ఇవ్వాలంటూ హింసకు గురవుతున్న వారు ఈ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయవచ్చు.