: కో పైలట్ లూబిట్జ్ వాడిన ఔషధం ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందట!
ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో జర్మన్ వింగ్స్ విమానాన్ని కూల్చేసిన కో పైలట్ ఆండ్రియాస్ లూబిట్జ్ మానసిక ఆందోళన తగ్గేందుకు వాడిన డ్రగ్ ఆత్మహత్యకు ప్రేరేపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. లూబిట్జ్ నివాసంలో పలు కీలక సాక్ష్యాలు సేకరించిన పోలీసులు, వాటి విశ్లేషణ మొదలు పెట్టారు. లూబిట్జ్ వాడుతున్న డ్రగ్స్ వివరాలు సేకరించారు. ఇందులో 'లోరాజెపమ్' అనే డ్రగ్ వాడుతున్నట్టు గుర్తించారు. ఆ డ్రగ్ వాడుతున్నవారు ఎలాంటి వాహనం నడపరాదని వైద్యులు సూచిస్తారట. ఆఖరుకు సైకిల్ కూడా వాడరాదని చెబుతారట. ఈ ఔషధం వాడే తొలినాళ్లలో, మానసికంగా విపరీత ధోరణులు కనిపించడమే అందుకు కారణం. ఇది వాడే కొత్తల్లో ఆత్మహత్యకు ప్రేరేపించినా, నెమ్మదిగా తగ్గిస్తుందట. 'లోరాజెపమ్' డ్రగ్ వాడమని సూచించిన వైద్యుడు విశ్రాంతి తీసుకోవాలని సూచించాడట. అతనికి లీవ్ లో ఉన్నానని, వీలైనంత త్వరగా కోలుకుని విధుల్లో చేరాలనుకుంటున్నానని లూబిట్జ్ అబద్ధం చెప్పేవాడట. మార్చి 24న ఎయిర్ బస్ 320ఏను 149 మంది ప్రయాణికులలో ఆల్ఫ్స్ పర్వతాల్లో కూల్చేసిన సంగతి తెలిసిందే.