: ఒకప్పుడు అండర్ ట్రయల్ ఖైదీ... ఇప్పుడతను జైళ్ల శాఖకు బాగా కావాల్సిన వాడు!
అమిత్ మిశ్రా అనే యువకుడు హర్యానాలోని బోండ్సీ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా 13 నెలలు గడిపాడు. 2013లో అతని భార్య విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడడంతో వరకట్న చావు కేసు కింద అరెస్టయ్యాడు. తదనంతరం బెయిల్ లభించింది. ఈ మధ్యకాలంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మిశ్రా ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. ప్రైవేటు సంస్థలో పనిచేస్తుండేవాడు. ఇక, బాధాకర పరిణామాల నేపథ్యంలో జైలుపాలయ్యాడు. అయితే, తొలి మూడు నెలల పాటు తీవ్ర వ్యాకులతకు లోనైన మిశ్రా, అప్పటి జైలు సూపరింటిండెంట్ హరీందర్ సింగ్ ప్రోత్సాహంతో ఓ సాఫ్ట్ వేర్ కు రూపకల్పన చేశాడు. జైలులోని ఖైదీల వివరాలు, వారి దినచర్య... తదితర అంశాలను డిజిటలీకరణ చేసేందుకు ఈ సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. తొలుత జైలు క్యాంటీన్ కార్యకలాపాలు ఆటోమేటిక్ విధానాన్ని అందిపుచ్చుకున్నాయి. అది మంచి ఫలితాలను ఇవ్వడంతో సాఫ్ట్ వేర్ ను మరింత అభివృద్ధి చేశాడు. ఖైదీ వేలిముద్రల నుంచి అతని క్రిమినల్ రికార్డు వరకు, అతని ఖాతాలో ఉన్న సొమ్ము, విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన తేదీలు, ఎన్ని పర్యాయాలు ఆసుపత్రిలో చికిత్స పొందాడు... ఇత్యాది వివరాలన్నీ కూడా ఒక్క క్లిక్ తో చూసే వీలు కలిగింది ఈ సాఫ్ట్ వేర్ తో. దానికి 'ఫినిక్స్' అని పేరు పెట్టాడు మిశ్రా. ఈ సాఫ్ట్ వేర్ ఉపయుక్తంగా ఉండడంతో మిశ్రాకు క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడతను హర్యానా జైళ్ల శాఖకు కావాల్సిన వాడయ్యాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా జైళ్లలోనూ ఈ సాఫ్ట్ వేర్ ను వినియోగంలోకి తేవడానికి జైళ్ల శాఖ నిర్ణయించింది. ఆ బాధ్యతలను ఏరికోరి మరీ మిశ్రాకే అప్పగించింది. బోండ్సీ జైలు ప్రస్తుత సూపరింటిండెంట్ కుల్బీర్ సింగ్ మాట్లాడుతూ, మిశ్రా మంచి నిపుణుడైన సాఫ్ట్ వేర్ అని, సౌమ్యశీలి అని ప్రశంసించారు. జైళ్ల శాఖకు అత్యుత్తమ సేవలు అందిస్తాడని భావిస్తున్నామని తెలిపారు.