: లంచమిచ్చి ఐఏఎస్ అకాడెమీలోకి ఎంటరయ్యా... కి‘లేడీ’ ఐఏఎస్ వెల్లడి!
ఐఏఎస్ అధికారులను తీర్చిదిద్దే ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో ఏమాత్రం అర్హత లేకున్నా ఏడు నెలల పాటు నిశ్చింతగా పాఠాలు విన్న మహిళ ఉదంతంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఉన్నతాధికారులతో పాటు సెక్యూరిటీ సిబ్బందికి మస్కా కొట్టి అకాడెమీలోకి ప్రవేశించిన రూబీ చౌదరి, అక్కడి సెక్యూరిటీ విభాగంలో పనిచేసే వ్యక్తి క్వార్టర్ లోనే మకాం వేసిన సంగతి తెలిసిందే. అయితే సెక్యూరిటీ సిబ్బంది అనుమానంతో తన మోసం బయటపడుతుందని భయపడి పరారైన సదరు మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా ఆమె పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. అకాడెమీలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారే తనకు సహకరించారని ఆమె తెలిపింది. అంతేకాక సదరు ఉన్నతాధికారికి రూ.5 లక్షల మేర లంచమిచ్చానని కూడా చెప్పింది. అకాడెమీలో తనకు లైబ్రేరియన్ పోస్టు ఇప్పించేందుకు సదరు అధికారి రూ.20 లక్షలకు ఒప్పందం కూడా చేసుకున్నాడని తెలిపింది. తమ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా రూ.5 లక్షలిచ్చానని, దీంతోనే ఆయన నకిలీ ఐడీ కార్డుతో తాను అకాడెమీలోకి ఎంటరయ్యేలా సహకరించారని పేర్కొంది. అకాడెమీ నుంచి బయటకు వెళ్లాక తన పేరు బయటపెట్టొద్దంటూ ఆ అధికారి భారీ మొత్తం ఆఫర్ చేశారని కూడా చెప్పింది. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటికే ఓ సెక్యూరిటీ అధికారిపై సస్పెన్షన్ వేటు పడగా, త్వరలోనే మరో కీలక అధికారిపైనా వేటు పడటం ఖాయంగానే కనిపిస్తోంది.