: మనదేశంలో 14 మహిళా పార్టీలున్నాయి తెలుసా?


మనదేశంలో మహిళా రాజకీయ పార్టీలు ఉన్నాయి తెలుసా? మహిళల సామాజిక, రాజకీయ అభ్యున్నతే లక్ష్యంగా 14 రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. 2001 నాటికి కేవలం రెండు మహిళా రాజకీయ పార్టీలే ఉండగా, 2015 నాటికి వాటి సంఖ్య 14కు పెరిగింది. ఇందులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగిన పార్టీలు కేవలం 5 కావడం విశేషం. ఫలితాల సంగతి పక్కన పెట్టాల్సిందే. అయితే, ఈ పార్టీలు మగవాళ్లు కూడా తమ పార్టీల్లో చేరవచ్చంటూ తాజాగా సూచిస్తున్నాయి. కేవలం మహిళలకే ఈ పార్టీలు అని భావించిన మగవాళ్లు వాటిల్లో చేరడం లేదని ఆయా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మహిళా ప్రాధాన్యత ఉంటుందే కానీ, తమ పార్టీల్లో ఎవరైనా సభ్యులుగా ఉండవచ్చని వారు చెబుతున్నారు. పార్టీలో కీలక స్థానాల్లో మహిళలే ఉంటారని వారు స్పష్టం చేస్తున్నారు. ఆల్ ఇండియా మహిళా దళ్, మహిళా అధికార పార్టీ, మహిళా స్వాభిమాన్ పార్టీ, యునైటెడ్ విమెన్ ఫ్రంట్, నారీశక్తి పార్టీ, జగన్మయ్ నారీ సంఘటన్ తదితర పార్టీలు ఢిల్లీ, హైదరాబాదు, బెంగళూరు, ముంబై, లక్నో పట్టణాల నుంచి రిజిస్టర్ చేయించుకున్నాయి. అజెండాలు వేరైనా, లక్ష్యం ఒక్కటేనని ఆ పార్టీలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News