: వారణాసిలో ఉచిత వై-ఫైకి కోతుల బెడద
దేశంలో సమాచార విప్లవం తీసుకురావాలని కేంద్రం రూ.1.12 లక్షల కోట్ల వ్యయం చేసేందుకు సిద్ధంగా ఉండగా, సమస్యలూ తక్కువగా ఏమీ కనిపించడంలేదు. విద్యుత్ కొరత, ప్రణాళికా లోపం, క్రిక్కిరిసిన నగరాలు... ఇలా ఎన్నో కష్టనష్టాలు వై-ఫై పథకానికి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. వీటికి తోడు కోతులు కూడా తయారయ్యాయి. ముఖ్యంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసిలో ఈ వానర మూక బెడద ఎక్కువగా ఉందట. ఇంటర్నెట్ వైర్లను తెంపేయడంతో పాటు, కొన్నిసార్లు వాటిని తింటున్నాయట. వందల సంఖ్యలో కోతులు ఇక్కడ భయానక వాతావరణం సృష్టిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. వైర్లు ఏర్పాటు చేసిన రెండు నెలల్లోనే కోతులు వాటిని నమిలేశాయని కమ్యూనికేషన్స్ ఇంజినీర్ ఏపీ శ్రీవాస్తవ తెలిపారు.