: తెలంగాణ పథకంపై దిగ్విజయ్ సింగ్ జోస్యం
టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకంపై కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ జోస్యం చెప్పారు. గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ, వాటర్ గ్రిడ్ పథకం ఓ కుంభకోణం కాబోతుందని అన్నారు. వాటర్ గ్రిడ్ పథకం వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని స్పష్టం చేశారు. కేవలం పైప్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే ఈ పథకం చేపట్టారని ఆయన విమర్శించారు. విభజన చట్టంలో ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను తెలంగాణకు ఇచ్చామని, అవి అమలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు. అటు, విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ 50 లక్షల సంతకాలు ఏపీ పీసీసీ సేకరించిందని ఆయన తెలిపారు. భూసేకరణ చట్టంపై ప్రతిపక్షాలతో మాట్లాడతామంటున్న కేంద్రం, ఆర్డినెన్స్ జారీ చేసేముందు ఎందుకు చర్చించలేదని ఆయన ప్రశ్నించారు. 2013లో భూసేకరణ చట్టం పార్లమెంటులో ఏకగ్రీవ ఆమోదం పొందిందని, దానిని మార్చాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.